19, డిసెంబర్ 2012, బుధవారం

చిన్నారి స్నేహం

చిన్నారి స్నేహం, చిన్ననాటి స్నేహం,
తెలిసీ తెలియని వయసులో
కల్మషం లేని మనస్సులో అల్లుకునే స్నేహం.
నిన్ను నిన్నుగా ఆదరించే స్నేహం.
అదే చిన్ననాటి స్నేహం.

లోకం తెలియని పసి హృదయాల్లో
జీవం పోసుకునే  అందమైన స్నేహం
స్వార్ధం లేని స్నేహం, కపటం తెలియని అనుబంధం.
ద్వేషాలు, తారతమ్యాలకు తావు లేని స్నేహం.
అదే చిన్ననాటి స్నేహం.

అమ్మ ఒడి నుండి చదువులమ్మ ఒడిలోకి చేరిన
పసిపాపల లేత హృదయాలకు
భయము, బెరుకు పారద్రోలి ధైర్యాన్ని మనసున నిలిపేదే
ఈ చిన్నారి చిట్టి పొట్టి స్నేహం.

మరి ఇంతటి విలువైన, వెలకట్టలేని స్నేహితులు పై చదువుల రీత్యా, ఉద్యోగాల రీత్యా, తలోదిక్కు విడిపోయి ఓ పదిహేను ఇరవై సంవత్సరాల తరువాత కలిస్తే???

అదో గొప్ప అనుభూతి. వర్ణించనలవికాని ఏవో భావ తరంగాలు
హృదయాంతరాల నుండి పొంగుకు వస్తున్నాయి.
వారి రూపురేఖలు ఎంత మారిన
మనసుకు మాత్రం అదే చిన్ననాటి రూపం
అవే భావాలు . మనసు ఒక్కసారిగా ఉరకలు వేస్తూ చిన్నతనం లోకి దూకేస్తోంది.


9, డిసెంబర్ 2012, ఆదివారం

ఓ మనసా...................!!!!!!!!!!!!!!!!!!


ఓ మనసా ఎంత పిచ్చి దానివే నువ్వు.
  ఇంతలోనే సంతోషం,  అంతలోనే ధుఃఖం 
క్షణాల్లో ఉప్పొంగుతావు, 
   చిన్న మాటకే కృంగిపోతావు.
నన్నెంతో ధైర్యవంతురాలిలా నిలబెడతావు 
    అంతలోనే  నన్ను పిరికిదాన్ని చేస్తావు.

ఇప్పుడేమైందని నీకంత  దిగులు?

తనే నా జీవితమని చెప్పావు....
నాలో సగమని మురిపించావు.....
అతనే నా ప్రాణమని నమ్మించావు......
నా ఊపిరే తను అయినప్పుడు,
తను ఆ శరీరాన్ని విడిచినంత మాత్రాన 
తను లేడు అని నన్నెలా నమ్మమంటావు?
నా శరీరంలో సగం తనది కాదా?
నే తీసుకునే ప్రతి శ్వాస లోనూ తను ఉన్నాడు.
కాదంటావా?
నా ప్రతి మాట లోనూ చేతలోనూ 
ప్రతి కదలికలోనూ తను జీవించే ఉన్నాడు.
మరి అలాంటప్పుడు ఎందుకు దిగులుపడతావు?
నిన్నటికి ఈరోజుకు ఏమిటి తేడా?
నిన్న తను నీ పక్కన ఉన్నాడు ; 
నేడు తను నీలోనే ఉన్నాడు. అంతే కదా !!!!!
  

3, డిసెంబర్ 2012, సోమవారం

మనసు పలికే

ఇది నా తొలి పోస్ట్.  జీవితం లో ఎన్నో ఆనందాలు, అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు. కొన్ని మరపురానివి, కొన్ని మరువలేనివి. కొన్ని పరిచయాలు, స్నేహాలు; తలవగానే చిరునవ్వు కలిగించేవి కొన్ని, కళ్ళలో కాంతుల్ని నిమ్పేవి కొన్ని. మనస్సుకి కొత్త ఉత్తేజాన్ని, ధర్యాన్ని ఇచ్చే జ్ఞాపకాలు కొన్ని అయితే, మనస్సు మోయలేని భారాన్ని, విషాదాన్ని నిమ్పేవి కొన్ని.   

మన జీవిత ప్రయాణంలో ఎందఱో వ్యక్తులు తారస పడుతూ ఉంటారు. మల్లె పూవు లాగ సువాసనను పంచె వారు కొందరైతే, ఎన్నెన్నో వర్ణాలతో కనువిందు చేసే గులాబి పూవులాంటి వారు మరికొందరు.  ఆహ్లాదాన్ని కలిగించడం మాత్రమె కాదు తలుచుకుంటే గాయపరచనూగలము అనే గులాబి ముళ్ళు లాంటి వారు కొందరు.  ఎదలోతుల్లో ఎన్నటికి చెదిరిపోని ఆకుపచ్చని జ్ఞాపకం లాంటి వారు కొందరు.

ఇలాంటి ఎన్నో సంఘటనల, వ్యక్తుల జ్ఞాపకాల ఝారి లో కొట్టుమిట్టాడే మనసు పలికే ఊసులే ఈ నా బ్లాగు.